Home  »  Bollywood News  »  జిమ్ ట్రైనర్ నుంచి స్టార్ యాక్టర్ వరకు.. ముస్తఫా అహ్మద్ జర్నీ ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్

Updated : Mar 24, 2026


- గన్ పట్టిన 'రిజ్వాన్' అసలు కథ తెలుసా?

- నెలకు 10 వేల జీతం నుంచి 1000 కోట్ల సినిమాలో కీలక పాత్ర వరకు.. 

- ముస్త‌ఫా అహ్మద్ సక్సెస్ స్టోరీ!

- ముస్తఫాను ప్రశంసల్లో ముంచెత్తుతున్న బాలీవుడ్ స్టార్ హీరోలు


సినిమా రంగంలో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో చెప్పడం కష్టం. తాజాగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ధురంధ‌ర్‌: ది రివెంజ్ చిత్రంలో రిజ్వాన్ అనే గూఢచారి పాత్రలో మెరిసిన ముస్త‌ఫా అహ్మద్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తెరపై గన్ పట్టి శత్రువుల గుండెల్లో నిద్రపోయిన ఈ నటుడు, నిజానికి ఒకప్పుడు స్టార్ హీరోలకు జిమ్ ట్రైనర్ అన్న విషయం చాలా మందికి తెలియదు. కేవలం ఫిట్‌నెస్ కోచ్‌గానే కాకుండా, తన నటనతోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ముస్త‌ఫా ప్రయాణం ఒక సినిమా స్టోరీని తలపిస్తోంది.

ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పోషించిన హమ్జా పాత్రకు కుడిభుజంగా, అత్యంత నమ్మకస్తుడైన రిజ్వాన్ పాత్రలో ముస్త‌ఫా అద్భుతంగా ఒదిగిపోయారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆయన చూపిన ఈజ్ చూసి అందరూ ప్రొఫెషనల్ నటుడు అనుకున్నారు. కానీ, ఆయనకు నటనలో ఓనమాలు కూడా తెలియదట. దర్శకుడు ఆదిత్య ధ‌ర్ ఆయనలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంతోనే ఈ అద్భుతం సాధ్యమైందని ముస్త‌ఫా స్వయంగా చెప్పుకొచ్చారు.

ముస్త‌ఫా గతం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒకప్పుడు ఢిల్లీలోని ఒక జిమ్‌లో కేవలం 10 వేల రూపాయల జీతానికి ట్రైనర్‌గా పనిచేశారు. చిన్నతనంలో డిస్లెక్సియాతో బాధపడటం వల్ల చదువు మధ్యలోనే ఆగిపోయింది. అయినప్పటికీ శారీరక దారుఢ్యంపై ఉన్న మక్కువతో ఫిట్‌నెస్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ వంటి అగ్ర హీరోలకు పర్సనల్ కోచ్‌గా వ్యవహరించి, వారి మేకోవర్‌లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 'పద్మావత్' సినిమా కోసం రణవీర్ సింగ్‌ను ఖిల్జీలా మార్చిన ఘనత ఈయనదే.

మొదట్లో యాక్టింగ్ అంటే భయపడిన ముస్త‌ఫా కు దర్శకుడు ఆదిత్య ధ‌ర్ వెన్నుముకగా నిలిచారు. "నువ్వు చేయగలవు.. నేనున్నాను" అంటూ ధైర్యం చెప్పి రిజ్వాన్ పాత్రకు ఎంపిక చేశారట. ధురంధర్ మొదటి భాగంలో చిన్న పాత్రలో కనిపించినా, రెండో భాగంలో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్‌తో అదరగొట్టారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈయన పోషించిన రిజ్వాన్ క్యారెక్టర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ముస్త‌ఫా అహ్మద్ సక్సెస్‌పై టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. హృతిక్ రోషన్ స్పందిస్తూ.. "ముస్త‌ఫా, నిన్ను వెండితెరపై చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. కంగ్రాట్స్" అంటూ విష్ చేశారు. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి సౌత్ స్టార్స్ కూడా 'ధురంధ‌ర్‌2' విజయాన్ని, అందులోని నటీనటుల ప్రతిభను కొనియాడుతున్నారు.

ప్రస్తుతం 'ధురంధ‌ర్‌2' వరల్డ్ వైడ్ గా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్‌తో ముస్త‌ఫా అహ్మద్‌కు మరిన్ని క్రేజీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. జిమ్ షట్టర్లు తెరిచే వ్యక్తి స్థాయి నుంచి గ్లోబల్ హిట్ సినిమాలో కీలక నటుడిగా ఎదిగిన ముస్త‌ఫా  ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.